Showing posts with label Telugu - Poetry. Show all posts
Showing posts with label Telugu - Poetry. Show all posts

Wednesday, 3 July 2024

ఇదెక్కడి వింత పంపకం?

తనకి అలుపు లేదు..
తనకి కోపం రాదు...
తనకి స్వార్ధం లేదు..
తనకి సహనం పోదు..
తనకి ఆశ లేదు..
తనకై తానేం కోరుకోదు...
తనకి విసుగు రాదు...
తను విశ్రాంతెపుడు తీసుకోదు...
తనకి తను అన్న భావం లేదు...
తనకి తనే ఉందో లేదో కూడ తెలీదు..

Wednesday, 24 June 2020

అలా అలా మాయమైపోకు నువ్వలా..

అలా అలా మాయమైపోకు నువ్వలా..
నీశీధిలో తోసి వెళ్ళిపోకు వెన్నెలా...
గతానికే గంథమేదో అద్దినావుగా..
హఠాత్తుగా ఊపిరందనీవు ఏంటిలా...

అద్దానికి కూడా దిష్టంటేనేమో నీ నవ్వుని చూపి ప్రతి ఉదయానా...
మౌనాలకి కూడా మాటొచ్చేనేమో నీ ఊసులు మోస్తూ తన వడిలోనా...

నీ మదిలో మెదిలే ప్రతి మంచి తలపే,
నా ఎదలో కురిసే ఓ మెరుపు తునకై...
నీ కనులు కదిపే ప్రతి చిన్న కలలో,
నా కధను కలిసా నే నీకు జతనై...

మరి...అలా అలా దూరమైపోకు నువ్వలా...
కలా నిజం ఏది ఏదో తెలియనంతలా...

తప్పేలే నాది నా ఊహల చెరలో నిను బందిచేసా మన కధలోన..
తోడుంటే చాలు అనుకున్నా కాని మాటైన లేక ఒంటరి చేసా...

నీకోసం ఎంతో చేసాననుకున్నా..
మాటల్లో ఏనాడూ ఏదీ అనకున్నా...!
కళ్ళలో నిన్నే నింపాననుకున్నా...
ముందున్నా నీకు వివరం లేకున్నా...!

అలా అలా మాటలన్ని దాచుకోకలా..
తెలీదులే మౌనమంత భరమా ఇలా...
మనసుల్లొ ఊహలన్ని ముందరుంచనా..
నా ప్రేమనే ఊపిరల్లే నీకు పంచనా... 

Thursday, 4 April 2019

నాలో ఉంటూ..

నాలో ఉంటూ..నా మాటే వింటూ...
నా గుండెల్లో రాగాలు లెక్కిస్తున్నావా...
ఇంకెన్నాళ్ళో లో లో అంటూ
నువ్వు నన్ను మౌనంగా ప్రశ్నిస్తున్నావా...

నీతో ఆడిపాడే రొజేనాడో అంటూ స్వాశే తొందరపెడుతుంటే...
జో జో కన్నా అంటూ, ఇంకా కొన్నాళ్ళంటూ మనసే నిన్ను లాలిస్తుందే...

నీ కదలికతో మొదలాయే నా కధలో ఒక మలుపే...
నా మదిలో ఆగక కురిసే నీ తలపుల తుంపరలే....
నీ నవ్వులొ నేనూ సగమై... కన్నీటిని ఆపే గుణమై..
నీ ఉనికికి ఊయలనవ్తాలే... 
నీ కలలకు కావలి కాస్తాలే...

Friday, 22 February 2019

ఇంద్రజాలం

నీ తలపుతో నా మనసులో మొదలయిందొక ఇంద్రజాలమే...
నీ కదలికే నా గుండెలో నింపుతుందట కొత్త ప్రాణమే...
నీ రాకకై నా లోకమే వేచుందిలే వేయి కన్నులై...
నీ ఊహతో నా ఊపిరే ముడిపడిందిలే పేగు బంధమై...


ఇంత ప్రేముందా లోలో అని నమ్మగలిగేలా...
నువ్వు చేరావా నాలో నేనమ్మనయ్యేలా...
కంటి పాపల్లో నిన్నే కాచుకుంటాగా..
నీ తేనె నవ్వుల్లో నన్నే చూసుకుంటాగా...


నువ్వు తడబడితే...కంట నీరు పెడితే...
నేను నిన్ను హద్దుకుని సర్దిచెప్పనా...
నువ్వు పొరబడితే...మాట కరుకయితే...
నీ చిట్టి గుండె నొచ్చకుండ నచ్చచెప్పనా...

చిన్ని చిన్ని సంతోషాలెన్నో నీ చుట్టూ నేనే నుంచోబెట్టనా...
అల్లిబిల్లి ఆటలెన్నెన్నో నీతో ఆడి పాడి బజ్జోబెట్టనా....
చుక్కలన్నీ చూస్తూ ఉండగా నీకు చక్కనైన కధలు చెప్పనా...
నీ తీపి తీపి మాటలన్నింటా ఎంతో కరుణే దాగే దారి చూడనా....




Sunday, 2 December 2018

తెలుసునా...

నా ఉదయం నీతోనే మొదలైతే అది చాలు...
నిదరోయే నిముషంలో నిను చూస్తే పదివేలు...
నీ పలుకే వినపడితే గుండెల్లో తిరణాల్లు...
జతగా కలిసడుగేస్తే సరిపోవే నూరేళ్ళూ....

కలలో నువ్వు కనబడితే...మనసే మురిసి నిలవదుగా...
ఇలలో నిన్ను చూస్తుంటే...ప్రాణం పరుగులాపదుగా...

రోజు రోజుకీ ఇంత వింతగా నువ్వు నచ్చేస్తు ఉంటే ఎలా...
పూట పూటకీ పెరిగిపొతున్న ప్రేమనంత చూపేది ఎలా?

బెరుకై నేను మిగిలుంటే... ధైర్యం నాకు నీవు కదా...
అలుపే లేక నా మనసే... తలిచే తలపు నీదే కదా...

నీవు లేకుంటే పొద్దుపోనంత నన్ను అల్లుకుంటుంటే ఎలా?
నీకు దూరమై నిముషమైన నన్నుండనీకపోతుంటె ఎలా?

ముడిపడిపోయామని మది మురవని రోజన్నది లేదని...
ప్రతివేకువ నీ ఎదపై మెలుకొని కల అనుకుంటానని...
నీ నవ్వుల సడి వినడానికి నే అల్లరినవ్తానని...
నీ కలతలు కరిగించే నీటిని నా కన్నుల దాస్తానని...

తెలుసునా...తమరికి...
మనసులో... సంగతి?
నేను నీ...
నీవు నా...
కోసమే ఏనాటికీ...