The great Indian kitchen మొదట సారి చూసినప్పుడు నాకు మా అమ్మ మాట గుర్తొచ్చింది.. నిన్న Mrs. చూస్తుంటే, అదే మాట మళ్ళి గుర్తొచ్చింది...
నాది పెద్దలు కుదిర్చిన పెళ్ళి, అబ్బాయి గురించి అమ్మ వాళ్ళు చెప్పింది, ఒక ఐదు నిముషాలు ఫోన్లో మాట్లాడింది తప్ప నాకేమి తెలీదు... నేను తనని మొదటిసారి నేరుగా చూసింది మా నిశ్చితార్దానికి ఒక 2-3 రోజుల ముందు...
పెళ్ళైనప్పుడు తను మస్కట్లో ఉండేవారు, నేను హైదరాబాద్లో టీచర్గా పనిచేస్తున్నాను, పిల్లల పరీక్షలు అయ్యేవరకు ఆగి, నేను తన దగ్గరకి వెళ్ళడానికి 6 నెలలు పట్టింది... కొత్త దేశం, కొత్త జీవితం...
నాకు వంట సరిగ్గా రాదు...అప్పటికి నేర్చుకోలేదు... ఏదో యూట్యూబ్ చూసి చేసేదాన్ని కాని ఏవి పెద్దగా కుదిరేవి కాదు....
అప్పటివరకు నా పనులు మాత్రమే చేసుకోవడం అలవాటైన నాకు, ఉన్నపాటుగా వేరొకరి భాద్యత తీస్కోవడం కొంచం కష్టంగానే అనిపించింది... సరిగ్గా లంచ్ బాక్స్ కూడ ఇచ్చేదాన్ని కాదు...ఇల్లు అందంగా ఎలా పెట్టుకోవాలో తెలిసేది కాదు...చాలా గిల్టీగా అనిపించేది నేనేమీ సరిగ్గా చెయ్యట్లేదు అని...తను ఎప్పుడైనా కూరలో ఏదో తక్కువైంది, ఏదో ఎక్కువైంది అన్నప్పుడు భాదొచ్చేసేది...నేను ఇంత కష్టపడి నేర్చుకుని చేస్తే వంకలు పెడ్తున్నారు అనిపించేది...
నాకు దొశ వెయ్యడం కూడ వచ్చేదే కాదు, దొశలన్ని అట్లైపోయేవి..ఇడ్లీలు రాళ్ళే.. పూరి పొంగేది కాదు, చపాతి తిరిగేది కాదు... ఏదీ కుదిరేది కాదు.. కాని తనెప్పుడూ నేను వండింది తినడం మానలేదు... బాగున్నా బాగోకపోయిన, ఉడికినా ఉడకకపోయినా, తినేసేవారు...
నేను వంట నేర్చుకుంది తన దగ్గరే, సుమారు పదేళ్ళు వేరే దేశంలో ఉండడం వలన వంట నేర్చేసుకున్నారు... మెల్లగా నేనూ నేర్చుకున్నాను...కొంచం తను నేర్పితే, మిగతాది మా అమ్మ ఫోన్లలో నేర్పింది..ఇప్పుడు పర్లేదు...అన్ని రకాలు చెయ్యలేను కాని, బ్రతికెయ్యొచ్చు..!
ఇంట్లో నేను చేసే ప్రతీ పనీ తను కూడా చెయ్యగలరు..చేస్తారు... వంటైతే నాకన్న బాగా చేస్తారు... (furniture assembly తప్ప.. అది నాకే వదిలేస్తారు)
సింకులో సామాన్లు కనపడడం ఆలస్యం, కడిగేస్తారు... లేవగానే నేను బాక్సులు పెట్టడానికి పరిగెడితే, ఈయన దుప్పట్లు మడతపెట్టేసి, మా అబ్బాయిని రేడీ చేసేస్తారు.. స్కూల్ డ్రెస్సు ఐరన్ చేస్తారు..బస్ ఎక్కించడానికి వస్తారు.. ఇవేవీ నేను తనని చెయ్యమని అడగక్కర్లేదు, చెప్పకర్లేదు... తను చేస్తారు...
ఇందుకేనేమో మా అమ్మ నాతో అంది.. ఆడపిల్లకి ఆవగింజంత అదృష్టం ఉండాలి అని...
ఎందుకంటే ఇది అన్ని ఇళ్ళలో జరగదు..
అలా జరగకపోవడం తప్పు అని మనకి తోచదు.... జరగడం అదృష్టం అని మాత్రం అనుకుంటాం..
కాని అలా ఎలా జీవితాన్ని అదృష్టానికి వదిలేస్తాం..?
ఒకవేళ ఇలా కాకపోయుంటే...? ఆ ఆవగింజంత అదృష్టం లేదని సరిపెట్టుకోవడమేనా? అంతేనా?
మన చేతుల్లో ఏం లేదా?
పెళ్ళి అయిపోయాకా జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవడం మాని, ఆ జీవితాన్ని నచ్చినట్టు మలుచుకునే హక్కు ఎప్పుడొచ్చేది?
ఇంటిపని ఒక్కరిదే కాదు, ఇంట్లో ఉండే అందరిది అని, తలో చెయ్యీ వెయ్యడం సాయం కాదు, భాద్యత అని ఎప్పుడు తెలిసొచ్చేది?
ఇంకెన్నాళ్ళు, ఎన్నేళ్ళు, మనిషికి మనిషివ్వాల్సిన గౌరవాన్ని, ప్రేమనీ, అదృష్టమనుకుని మురిసిపోయేది..?
ఎవ్వరికైనా సరే, సాటివారిని గౌరవించడం తెలియాలి, కొన్ని పనులు వచ్చే తీరాలి... రాకపోయినా నేర్చుకునే ఆలోచన ఉండాలి..నేర్చుకోవాలి... చేస్తున్నారు కదా అని చెయించుకోవడం తప్పు... కృతజ్ఞత కూడా లేకుండా చేయించుకోవడం ఇంకా పెద్ద తప్పు...
ఇది పెళ్ళైన వాళ్ళకి మాత్రమే కాదు... అందరికీ...మన ఇంట్లో ఎవరో ఒకరు నిత్యం పని చేస్తూనే ఉంటారు, అందరి భాద్యతా మోస్తూనే ఉంటారు...అది మన పని కూడా అని అర్ధం చేసుకుని, మన వంతు మనం చెయ్యాలి... చేస్తూ ఉండాలి...
ప్రేమ మాటల్లో పొర్లితే చాలదు...చేతల్లో కనపడాలి...
ఆవగింజంత అదృష్టం సంగతేమో కాని, ఆవగింజంత ఆనందం ఇవ్వడం ఐతే మన చేతుల్లో పనే... !